విఠ‌ల్ కు కేసీఆర్ మరో అవకాశం ఇవ్వనున్నారా?

టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను వెంటనే నియమించాలి అని హైకోర్టు సూచించినందున కేసీఆర్ ఈ విషయంలో ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి తన వెంటే ఉంటూ, తన మనిషిగా గుర్తింపు పొందిన సిహెచ్ విఠల్ కు ఇంతకుముందు టీఎస్పీఎస్సీ సభ్యుడి గా అవకాశం కల్పించారు. కేసీఆర్ తన పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అంకిత భావంతో పనిచేశారు. నియామకాల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా అత్యంత జాగ్రత్త తీసుకున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావడంలో చైర్మన్ తో కలిసి సమన్వయంతో పనిచేశారు. ఈ సారి చైర్మన్ పదవి అతనికి ఇస్తే అనుభవం ఉన్న వ్యక్తిగా, కేసీఆర్ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మరియు టీఎస్పీఎస్సీ కి మరింత మంచి గుర్తింపు తీసుకుని రాగలడని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండీ నేటి వరకు ఏ చిన్న ఆరోపణ లేని వ్యక్తిగా, కేసీఆర్ అనుచరిడిగా అతనికి పేరుంది. టీఎస్పీఎస్సీ సభ్యునిగా రిటైర్ కావడం వలన అతనికి తిరిగి తన ఉద్యోగంలో చేరే అవకాశం లేదు. కేసీఆర్ ఆదేశించగానే తన ఐదు సంవత్సరాల సర్వీసు నష్టపోతానని తనకు తెలిసినప్పటికీ, పలువురు పునరాలోచించుకోమని సూచించినప్పటికీ, కేసీఆర్ తనకెప్పుడూ నష్టం చేయడనే దృఢమైన విశ్వాసం తో తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు  చేపట్టాడు. అతనికి సర్వీస్ పరంగా జరుగుతున్న నష్టం, అతని నిరాడంబరత, విధేయత మరియు కేసీఆర్ కు అతని పట్ల ఉన్న నమ్మకం తదితర అంశాలు పరిశీలించినట్లైతే అతడిని చైర్మన్ గా కేసీఆర్ నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో విఠ‌ల్ (పాత చిత్రం)

 

సిహెచ్ విఠల్ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ పైన అతనకి ఉన్న గౌరవం, విశ్వాసం గురించి ఒక‌సారి ప‌రిశీలిస్తే..

కేసీఆర్ పార్టీ పెట్టిన సమయంలో రాజకీయ నాయకులే తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడానికి భయపడుతుంటే, విఠల్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి, అన్ని స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులను అందులో సభ్యత్వం చేయించి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేసి, ఉద్యోగులను కూడా ఉద్యమంలో పనిచేసే విధంగా కృషి చేశాడు. అంతేకాకుండా తెలంగాణ సాధనలో, సమైక్య వాదులను నిలదీసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బలంగా వినిపించాడు.

తెలంగాణలోని అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు అండగా నిలబడి, అందరినీ ఒక్క తాటిమీద నిలబెట్టి, వారి సమస్యలు పరిష్కరించి తెలంగాణ ఉద్యోగుల నికార్సయిన నాయకుడు అనిపించుకున్నాడు.

610 జీఓ ఉల్లంఘనతో తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాలను స్పష్టంగా తెలియజేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, ప్రతి సభకు, సమావేశానికి హాజరై, తెలంగాణ లోని అన్ని ఉద్యోగ సంఘాల కన్నా ముందు వరుసలో నిలిచి, ఉద్యోగుల ప్రతినిధిగా తన గళాన్ని వినిపించాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన ప్రారంభంలో రాష్ట్ర అభివృద్ధిలో సహితం ఆంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే, వారు చేస్తున్న కుట్రలు అందరికీ తెలియజేసి ప్రభుత్వానికి చేదోడువాదోడుగా నిలిచాడు విఠల్. ఆ తర్వాత కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టినా విఠల్ మాత్రం అతని వెంటే ఉన్నాడు, తను ఎప్పుడూ కేసీఆర్ వెంటనే ఉంటానని, తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేస్తానని ఖరాఖండిగా తెలియజేశాడు.

అందుకే విఠల్ కు బోర్డు మెంబర్ గా రిటైర్ అయిన వెంటనే, చైర్మన్ పదవి రాబోతుందని అందరూ ఊహించారు కానీ అలాంటి ప్రకటన ఏదీ రాకపోయేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆలస్యమైనా బహుశా వారికి టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప‌లురువురు అనుకుంటున్నారు. ఉద్యోగ నియామకాలు, సర్వీస్ రూల్స్ తదితర అంశాల్లో ఎంతో  అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉంటేనే సరైన న్యాయం జరిగి, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అందరి అభిప్రాయం.

అంతేకాకుండా ఉద్యోగ నియామకాలలో వచ్చే ప్రధానమైన సమస్య కోర్టు కేసులు. ఆ కోర్టు కేసులను పరిష్కరించడానికి చట్టాలపై అవగాహన మాత్రమే సరిపోదు తెలంగాణ సామాజిక నేపథ్యం, ఇక్కడి జీవన స్థితిగతుల పైన అవగాహన అవసరం. కావున  కోర్టు కేసులను పరిష్కారం చేయడంలో ఉద్యోగ నియామకాలు త్వరితగతిన చేపట్టడంలో విఠల్ కు ఉన్న అవగాహన, అనుభవం అపారం. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఉపయోగపడుతాయని ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో కొద్ది రోజుల్లో తేలనుంది.

1 Comment
  1. Sagar says

    Excellent news

Your email address will not be published.