కొండెక్కిన ఉల్లి

సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై భారం..

ఉల్లి కోస్తే క‌న్నీరు వ‌స్తుంది.. కానీ ప్ర‌స్తుతం ధ‌ర వింటేనే ద‌డ‌పుడుతోంది. ఇప్పుడు ఇది సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి.. కొండెక్కి కూర్చోన్న ఉల్లి ధర దిగనంటే దిగనంటుంది. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో ఉల్లి బదులు కీర దోసను సర్వ్ చేస్తున్నారు. వంటల్లో కూడా ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. ఇంకో విషయం ఏంటంటే కోడిగుడ్డు. ఉల్లిగడ్డ ఒకటయ్యాయి. సింగిల్ కోడిగుడ్డు ధర ఒకటి రూ.6 ఉంది. అదే ఉల్లిగడ్డల ధర కేజీ రూ.90 వరకు ఉంది. ఒక కిలోలో 15కు మించి ఉల్లిగడ్డలు రావడం లేదు. ఈ లెక్కన ఒక్క ఉల్లిగడ్డ ధర ఆరు రూపాయలు అన్నమాట.

ఇదే అదునుగా వ్యాపారులు ఉల్లిగ‌డ్డ‌ల‌కు గిరాకీ పెంచేశారు. కొద్ది రోజులుగా వీటి ధ‌ర మార్కెట్లో విప‌రీతంగా పెరిగిపోయింది. సిటీల్లో కిలో రూ.100 ఉంటే.. గ్రామాల్లో కిలోకు రూ.120గా అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరదల ప్రభావమే ఉల్లి రేటు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు దీన్ని కొనుగోలు చేయ‌లేక‌పోతున్నారు.

 

ఉల్లిని నాసిక్‌, లాసల్‌గావ్‌, అకోల, తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఉల్లి దిగుబడులు తగ్గిపోయాయి. కొత్త పంట చేతికి రాకపోవడంతో కొరత ఏర్పడి..డిమాండ్ పెరిగింది. మరో పది రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు ఉల్లి పాడైపోవడంతో కొరత ఏర్పడింది. ఇప్పట్లో పంట కూడా చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకుండా పోతోంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే సాగు అవుతోంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లిధర మరింత పెరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

-శ్రీ‌నివాస్ బండారి

Leave A Reply

Your email address will not be published.