కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్లో చేనేత, జౌళిశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు కొడకండ్లలో మినీ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంతో పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేత కార్మికులు సరైన ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లారని, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగానికి మద్దతుగా నిలవడంతో వారంతా తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరెల తయారీని ఈ సారి కూడా కొనసాగిస్తామన్నారు.
గతంలో ప్రారంభించిన నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా సంక్షోభంలోనూ కార్మికులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరిందని కేటీఆర్ తెలిపారు. కాలపరిమితి కన్నా ముందే తమ పొదుపుతోపాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ను ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు ద్వారా సుమారు 25 వేల మంది నేతన్నల కుటుంబాలకు రూ. 95 కోట్లు అందాయన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలన్న నేత కార్మికుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో టెక్స్టైల్, చేనేత రంగాలకు కేటాయింపులపై కసరత్తు చేసి నివేదిక తయారు చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మినీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌కు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.