కోలుకుని మా ఇంటికి రండి
అభిమానికి ధైర్యం చెప్పన రజిని

చెన్నై: ‘నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను’ ఈ మాటల్ని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానిలో ధైర్యాన్ని నింపటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బాషాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారంతా ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. కాగా రజినీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన మురళీ అనే వ్యక్తికి కరోనా సోకి, ఆ వైరస్‌కు కిడ్నీ సమస్యలు తోడై తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ‘తలైవా! 2021లో గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి! అదే నా చివరి కోరిక’ అంటూ అభిమాని పంపిన ట్వీట్‌కు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చలించిపోయారు. వెంటనే ఆయన ఆ అభిమానిని ఓదారుస్తూ ఓ వీడియో సందేశం పంపారు. అభిమాని ట్విట్టర్ సందేశం, రజనీ వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై సంచలనం కలిగిస్తున్నాయి. మదురైకి చెందిన రజనీ వీరాభిమాని మురళి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రజనీ సినీరంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మురళీ ఆయన అభిమాన సంఘం ఏర్పాటు చేశారు. ఇటీవల అతడికి కరోనా సోకింది. పాజిటివ్ లక్షణాలతో కిడ్నీ తదితర సమస్యలతో అతడి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ఇక తాను బతకనేమోననే భయంతో మురళి తన అభిమాన నాయకుడు రజనీకాంత్ నుద్దేశించి ట్విట్టర్‌లో ఓ సందేశం పంపాడు. ఆ సందేశంలో ‘2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను’ అని పేర్కొన్నాడు.అని మురళి పేర్కొన్నాడు. ఈ సందేశం సోషల్ మీడియాలో విడుదల చేసిన గంటలోపే వేలాదిమంది నెటిజెన్లు లైక్ కొట్టారు. తన అభిమాని ట్వీట్‌ను చూసి రజనీకాంత్ చలించిపోయి, అతడిని ఓదార్చేలా అప్పటికప్పుడు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆ సందేశంలో ‘మురళీ! నేను రజనీకాంత్ మాట్లాడుతున్నాను. నీ ఆరోగ్యానికి హాని కలగకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. నువ్వు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వెళతావు! ఆ తర్వాత దయచేసి కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి. నేను మిమ్మల్ని చూస్తాను’ అంటూ రజనీకాంత్ తన అభిమానికి ధైర్యం చెప్పారు.