గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు 

 

చెన్నైః  సంగీత‌మే శ్వాస‌గా, పాటే ప్రాణంగా తుది వ‌ర‌కు గ‌ళ మాధుర్యాన్ని పంచిన గాన క‌ళాత‌ప‌స్వి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి కుటుంబీకులు, అభిమానులు క‌న్నీటితో క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. ఆస్పత్రి నుంచి చెన్నై నుంగంబాక్కంలోని నివాసంలో ఆయన పారి్థవదేహాన్ని ఉంచారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం వద్ద వున్న ఎస్‌పీబీ గార్డెన్‌కు  పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు.  శనివారం ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిమానులు, ఆప్తులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. గాన గంధర్వుడి కడచూపుకోసం అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి.  అయితే, విజయ్‌ హఠాత్తుగా అక్కడ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎస్పీబి భౌతికకాయానికి నివాళులర్పించిన విజయ్, ఆయన కుమారుడు చరణ్‌తో మట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.  ప్రముఖులు అభిమానుల సందర్శనను 10.45 గంటలకు నిలిపి వేశారు. తర్వాత సమీప బంధువులు, కుటుంబీకుల్ని అనుమతించారు. ఎస్పీబీ తనయుడు చరణ్‌ సంప్రదాయబద్ధంగా ప్రక్రియల్ని ముగించారు. ఎస్పీ అరవిందన్‌ నేతృత్వంలో సాయుధదళ పోలీసులు ఎస్పీబీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సమయంలో జోహార్‌ ఎస్పీబీ నినాదం మార్మోగింది.

 

బాలన్నా…పాట పాడవా:కడ చూపుకోసం వచ్చిన సినీ నటుడు అర్జున్‌ ఎస్పీబీ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. బాలన్న.. తన చిత్రాల్లో ఎన్నో దేశభక్తి పాటలను పాడి విజయా న్ని అందించావని, ఇప్పుడు లేచి ఓ పాట పాడ వా అంటూ అర్జున్‌ ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే  ఎస్పీబీకి సినీ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన చరిత్రను చాటే రీతిలో కేంద్రం భారతరత్నతో గౌరవించాలని దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఎస్పీబీకి నివాళులర్పించే క్రమంలో భారతీ రాజా, గాయకుడు మనో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.  త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌ర‌ఫున సాంస్కృతిక శాఖ మంత్రి కె. పాండ్య‌రాజ‌న్ హాజ‌ర‌య్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్, తువ‌ళ్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ మ‌హేశ్వ‌రి, శుభ‌లేక సుధాక‌ర్‌,  దర్శకుడు  భారతీరాజా, అమీర్, రçహ్మాన్, సింగర్‌ మనో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్, హాస్యనటుడు మైల్‌స్వామి బుల్లితెర నటుడు కృష్ణన్, బోండామురుగన్ తో  పాటు పలువురు ప్రముఖులు అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.