గులాబీ టెస్టులో భారత్ అద్భుత‌ విజయం

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘ‌న విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 49 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. 10 వికెట్ల తేడాతో విజ‌యం అందుకుంది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (25 బంతుల్లో 25 ర‌న్స్‌), శుభ్‌మ‌న్‌గిల్ (21 బంతుల్లో 21 ర‌న్స్‌)
చ‌క్క‌టి షాట్ల‌తో ఆక‌ట్టుకున్నారు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యాన్ని సాధించింది. స్పిన్‌కు సహకరిస్తున్న వికెట్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌(3/26, 4/48), అక్షర్‌ పటేల్‌(6/38, 5/32) విజృంభించి టీమ్‌ఇండియాను గెలిపించారు.

సెకండ్‌ సెషన్‌లో భారత స్పిన్నర్లు మరింతగా విజృంభించడంతో ఇంగ్లాండ్‌ వందలోపే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్‌..భారత్‌కు 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 7.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

మూడో టెస్టులో స్పిన్నర్ల జోరు కొనసాగింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. టెస్టుల్లో భారత్‌పై ఇంగ్లాండ్‌(81) అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌ ఇరుజట్లకు చెందిన బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా తడబడ్డారు. స్పిన్నర్లు తిప్పేయడంతో టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది. భారత్‌లో జరిగిన రెండు డే/నైట్‌ టెస్టుల్లోనూ టీమ్‌ఇండియానే గెలిచింది.

తొలి ఇన్నింగ్స్‌:

  • ఇంగ్లాండ్‌:112
  • భారత్‌:145

రెండో ఇన్నింగ్స్‌:

  • ఇంగ్లాండ్‌:81
  • భారత్‌:49

Leave A Reply

Your email address will not be published.