గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం తొలగింపు!
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటిఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటిఎంతో పాటు పేటిఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తీసివేంసింది. వన్ 97 కమ్యూనికేషన్స్ యాజమాన్యంలోని యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సెర్చ్ చేసినప్పుడు కనిపించలేదు. ఐతే పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్, తదితర కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. గ్యాంబ్లింగ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించడంతో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నది.
కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో యాప్‌ను గూగుల్ తొలగించింది. గూగుల్ పాలసీలను పేటీఎం పదేపదే ఉల్లంఘించినట్లు కూడా గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్ అనుమతిస్తున్నది. ఇది స్టోర్ట్స్ బెట్టింగ్‌కు పాల్పడేందుకు కూడా సహకరిస్తుందని గూగుల్ చెబుతున్నది.
ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగించడంపై పేటీఎం ట్విటర్లో స్పందించింది. ‘కొత్త డౌన్లోడ్లు లేదా అప్డేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే యాప్ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుంది. యూజర్ల సొమ్ము అంతా పూర్తిగా సురక్షితం. ఎప్పటిలాగే మీ పేటీఎం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు’ అని పేర్కొంది. పేటీఎంకు 5కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. పేటిఎం ఐవోఎస్ వెర్షన్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.