గోదావ‌రికి పెరిగిన వ‌ర‌ద‌

భద్రాచలం: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రికి మ‌ళ్లీ వ‌ర‌ద పోటెత్తుతోంది. గోదార‌మ్మ శాంతించింది ఇలా అనుకున్నామోలేదో… మళ్లీ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పోటెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి 43 అడుగులకు వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక విరమించారు. గురువారం ఉదయం 11 గంటలకు 45.8 అడుగులకు వరద ఉద్దృతి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి, కాళేశ్వరం, తాలిపేరు, పేరూరు వైపు నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో భద్రాచలం వద్ద ఈరోజు రాత్రి 9 గంటలకు 48 అడుగుల నీటి మట్టం చేరుకుంటుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. మరోవైపు నిన్నటి నుంచి రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. కాగా ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉగ్రరపం దాల్చనుంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరులో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. క‌ట్టువాగు, మొట్ల వాగు, కోడిపుంజుల వాగుల‌కు వ‌ర‌ద భారీగా రావ‌డంతో మ‌ణుగూరును వ‌ర‌ద ముంచెత్తింది. ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.