గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు ఖరారు !

హైదరాబాద్ :రాష్ర్ట శాసనమండలిలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం.
దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు.
ఇక వైశ్య సామాజిక వర్గం కోటాలో దయానంద్‌కు అవకాశం కల్పించారట. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఈసారి ఎమ్మెల్సీగా చట్టసభకు పంపంచి గౌరవించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారట. మరికొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ మంత్రివర్గ సమావేశం తీసుకున్నారు. దుబ్బాక ఓటమి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకుల మరింత కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారట.
గోరటి వెంకన్న..
- తండ్రి పేరు : గోరటి నర్సింహ్మా
- తల్లి పేరు : గోరటి ఈరమ్మ
- విద్య : ఎంఏ తెలుగు(ఓయూ డిస్టెన్స్)
- రచనలు : ఏకునాధం మోతా, రేలపూతలు, అలసెంద్ర వంక, పూసిన పున్నమి, వెల్లంకి తాళం, ది వేవ్ ఆఫ్ ది క్రిసెంట్ పుస్తకాలను రచించారు.
- అవార్డులు : మధ్య ప్రదేశ్ ప్రభుత్వంచే కబీర్ సమ్మాన్, రాష్ట్ర ప్రభుత్వంచే కాళోజి అవార్డు, ఉగాది పురస్కారం, సినారె అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, అరుణ్ సాగర్ అవార్డు, అధికార భాషా సంఘం పురస్కారాలను అందుకున్నారు.
బస్వరాజు సారయ్య..
- రజక కులానికి చెందిన సారయ్య 5 డిసెంబర్,1955, వరంగల్‌లో జన్మించారు.
- విద్య : ఇంటర్మీడియట్, ఐటీఐ
- మాజీ మంత్రిగా పనిచేశారు
- దక్షిణ భారతదేశంలోనే రజక కులం నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తి
- 1999, 2004, 2009లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
- వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా సైతం పనిచేశారు.
బొగ్గారపు దయానంద్..
- 3 మే, 1954లో జన్మించారు.
- విద్య : బీఎస్సీ
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్(ప్రోటోకాల్)గా పనిచేశారు. 2003లో పదవీ విరమణ పొందారు
- ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్నారు
- వాసవీ సేవా కేంద్రానికి లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్
- 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్నారు.