గ్యాంగ్‌రేప్‌కు గురైన యుపి యువతి మృతి
న్యూఢిల్లీ : దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.
యుపిలోని హత్రాస్‌లో రెండు వారాల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. ఆమె శరీరమంతా తీవ్రగాయాలు కావడంతో పాటు నాలుకను కూడా కత్తిరించారని, దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. యుపిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం ఢిల్లీ ఆస్పత్రికి తరలించారు.
హత్రస్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 14న తన అమ్మ, సోదరుడితో కలిసి గడ్డి కోసం పంట పొలాల్లోకి వెళ్లారు. గడ్డి కోసుకుని ముందే సోదరుడు ఇంటికి వచ్చాడు. తల్లి, కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దుండగులు సమీపంలో ఉన్న సజ్జ చేనులోకి లాక్కెళ్లారు. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఎస్సీ కులానికి చెందిన యువతి కాగా, నలుగురు దుండగులు అగ్రకులాలకు చెందిన వారు. తొలుత ఈ కేసు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్ర కులానికి చెందిన వారు కావడంతో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారని మండిపడ్డారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.