గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెర…

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 150 వార్డులనుంచి 1122మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది` అని అన్నారు.
మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లుగా ఉన్నాయి. 921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్‌గా ఉన్నాయి. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేస్తాం. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పకుండా మాస్క్ ధరించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాల’’ని అన్నారు.
మరోవైపు.. మొత్తం 150 వార్డుల బరిలో 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు… ఇందులో టీఆర్ఎస్ నుంచి 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415గా బరిలో ఉన్నారు. ఇక, మొత్తం 36,404 సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు.. పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202 మంది విధులు నిర్వహిస్తారు. ఎల్లుండి (డిసెంబర్ 1వ తేదీన) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది… అంటే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పిస్తారు.