జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా.!

టోక్యో: అనారోగ్య కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబే శుక్రవారం ప్రకటించారు. గత కొంత కాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటు్ల ఆయన వెల్లడించారు. కడుపులో కణితి ఏర్పడటంతో ఈ మధ్య ఆరోగ్యం మరింత క్షీణించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో పాలించే స్థితిలో లేను. ఈ కరోనా కష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే. ఏడాది సమయం ముందుగానే రాజీనామా చేస్తున్నందుకు ప్రజలు మన్నించాలి` అని వినమ్రంగా వంగి స్థానిక మీడియాకు తెలిపారు.
ప్రజలు తనపై పెట్టిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేక పోతున్నందున పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాజకీయాల్లో ఫలితాలను సాధించడం చాలా ముఖ్యమని, అనారోగ్యం కారణంగా రాజకీయ నిర్ణయాల్లో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందున ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌కు కాబోయే ప్రధాని ఎవరనేది తేలాల్సి ఉంది.