జరిమానా కట్టేందుకు సిద్ధం : భూషన్
న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కార నేరం కింద అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఒక రూపాయి జరిమానా విధించింది.న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా తేలిన ఆయన.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం తుది తీర్పును వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం సీనియర్ అటర్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు ఒక్క రూపాయి జరిమాన విధించింది. ఇక కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ప్రశాంత్ భూషన్ న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తన సీనియర్, న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ట్విటర్ వేదికగా ప్రకటించారు.
కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం విధించిన జరిమానాను అంగీకరించినట్లు వెల్లడిస్తూ.. తన సీనియర్‌తో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా తాను తప్పేమీ చేయలేదని, కోర్టుకు క్షమాపణ చెబితో తప్పు చేసినట్లు అవుతుందని ప్రశాంత్ భూషన్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే తీర్పు సందర్భంగా ప్రశాంత్ భూషన్‌పై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్ 15వ తేదీ లోగా రూపాయి జరిమానా కట్టాలని, లేకుంటే మూడు నెలల జైలుశిక్ష, మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తిపై నిషేధం ఉంటుందని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేను, సుప్రీంకోర్టును విమర్శిస్తూ ప్రశాంత్‌భూషణ్ ట్వీట్లు చేయడంతో ఆయనపై సుమోటాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోర్టు కోరగా ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. తన వ్యాఖ్యలు అసలు కోర్టు ధిక్కరణ కిందకు రావని, తాను క్షమాపణ చెపితే నిజంగానే కోర్టు ధిక్కరణ చేసినట్లని ఆయన పేర్కొన్నారు.