‘జల్లికట్టు’కు అనుమతులిచ్చిన తమిళనాడు సర్కార్

చెన్నై : తమిళనాడులో ‘పొంగల్’ (సంక్రాంతి) సందర్భంగా నిర్వహించే వేడుక జల్లికట్టు.. కాగా ఈ సారి ఈ ఉత్సవాలను జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి 50 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే హాజరుకావాలని వెల్లడించింది. ఈ వేడుకల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు.
కాగా, ఈ వేడుకలో మైదానంలో ఒక ఎద్దును వదులుతారు. సభ్యులు ఆ ఎద్దును నియంత్రించాల్సి వుంటుంది. అయితే ఎవరు ఎక్కువ సేపు నియంత్రిస్తారో వారే విజేతలు. ఈ క్రీడ కోసం ప్రత్యేకంగా బోస్ ఇండికస్, హంప్డ్ జాతికి చెందిన ఎద్దులను పెంచుతుంటారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ క్రీడను నిషేధించాలని జంతు సంరక్షణ సంఘం సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పశువులను హింసించే ఈ క్రీడ అనాగరికమైనదని వారు వాదిస్తుండగా, తమిళనాడు సంస్కృతి, సాంప్రదాయంలో భాగమని అక్కడి రాజకీయ నేతలు, ప్రజలు పేర్కొంటున్నారు.