జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల విజయలక్ష్మి

డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి అధికారికంగా ప్ర‌క‌టించారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌తో పాటు కార్పొరేట‌ర్ల‌కు శ్వేతామ‌హంతి శుభాకాంక్ష‌లు తెలిపారు.
కాగా బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి రెండోసారి గెలవగా, మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా తొలి సారి గెలిచారు. బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి బరిలోకి దిగగా బీజేపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శంకర్ యాదవ్ బరిలోకి దిగారు. అయితే ముందు రవి చారి పోటీ చేయాలనీ భాబించినా ఆయన రావడం లేట్ కావడంతో అనూహ్యంగా శంకర్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక ఎంఐఎం ఎలాంటి అభ్యర్ధులను ప్రతిపాదించకుండానే రెండు పదవులకి టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. గెలిచే సంఖ్యా బలం లేకున్న బీజేపీ ఎందుకు పోటీ చేస్తుందనే చర్చ జరుగగా బీజేపీ నేతలు.. తాము ఎందుకు పోటీ చేస్తున్నామో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జిహెచ్ ఎంసిలో 150 మంది కార్పొరేట‌ర్ల‌కు గాను టిఆర్ ఎస్ 56, బిజెపి 48 మంది (వీరిలో ఒక‌రు చ‌నిపోవ‌డంతో 47) కొర్పొరేట‌ర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది. కాంగ్రెస్‌కు ఇద్ద‌రు ఉన్నారు. ఎక్స్ అఫిషియో స‌భ్యులు టిఆర్ ఎస్‌కు 32, బిజెపిక 2, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. మేయ‌ర్ ఎన్నిక‌కు 97 మంది స‌భ్యుల‌తో కోరం ఉండాలి. ఈ నేప‌త్యంలో 56 మంది స‌భ్యులున్న టిఆర్ ఎస్‌ ఎంఐఎం మ‌ద్ద‌తుతో వ్యూహాత్మ‌కంగా రెండు ప‌ద‌వుల‌ను కైవ‌సం చేసుకుంది.

కాగా నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫ‌సీయుద్దీన్‌, గాజుల‌రామారం కార్పొరేట‌ర్ శేష‌గిరి ప్ర‌తిపాదించారు. డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త పేరును మ‌చ్చ‌బొల్లారం కార్పొరేట‌ర్ రాజ్ జితేంద‌ర్ నాథ్, కూక‌ట్‌ప‌ల్లి కార్పొరేట‌ర్ జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌ ప్ర‌తిపాదించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు: మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి
ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అంద‌రి స‌ల‌హాలు స్వీక‌రిస్తాను అని పేర్కొన్నారు. న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తాను అని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.