జూన్ 15 నుంచి రైతుబంధు సాయం
హైదరాబాద్ (CLiC2NEWS): రైతుబంధు ఆర్థిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సిఎం కే చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖను ఆదేశించారు. జూన్ 10 వ తేదీని గడువుగా పెట్టుకుని అప్పటి వరకు రెవెన్యూ భూఖాతాల్లో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి పేర్లు మారిన రైతులందరికీ ఈ మొత్తాన్ని వేయాలన్నారు. అదేవిధంగా ఆర్వోఎఫ్‌ఆర్ భూములకు కూడా రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం వ్యవసాయ శాఖపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. కల్తీ విత్తనాల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి.. `ఇక మీరు నరసింహావతారం ఎత్తాలె. దొరికినోళ్లను దొరికినట్లే పట్టుకుని పిడి చట్టం కింద కేసులు పెట్టాలె. తెలంగాణలో కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేలా మీ చర్యలుండాలె. వారు తప్పించుకోకుండా డేగకన్నుతో చక్రవ్యూహం పన్నాలె. నకిలీ విత్తనాలే కాదు.. ఎరువులు, జీవన పురుగుమందుల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను వదలకండి.. అని చెప్పారు.
అలాగే ఇకనుంచి విత్తనాలు, పెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలాచూడాలని, ప్రభుత్వం జారీచేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. విత్తనాలు, ఫెస్టిసైడ్‌లలో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలుచేస్తూ, అవసరమైన చట్ట సవరణచేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీచేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.
జూన్ 15 నుంచి 25 లోపల రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని సీఎం ఆదేశించారు.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి
‘తెలంగాణ వ్యవసాయం ఎకడ ప్రారంభమైంది.. ఎంత ఉన్నతస్థాయికి చేరుకొన్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కటకటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీజలాలతో నిండి ఉన్నయి. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. ఒక వాన పడితే చెరువులు అలుగులు దుంకడానికి సిద్ధంగా ఉన్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయంకాదు. పంజాబ్‌కు సరిసమానంగా తెలంగాణలో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాళ ప్రభుత్వం ఒక గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్టకాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రిని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్ల వ్యవహారాలుచూసేందుకు ఒకరిని, మారెటింగ్ అనాలసిస్ రిసెర్చ్ వింగ్ కోసం మరో అడిషనల్ డైరక్టర్‌ను నియమించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను నిర్దేశించారు.
మొత్తం ధాన్యం కొనాలని కేంద్రాన్ని కోరతాం..
ధాన్యం కొనుగోలుకు ఎంతో ధైర్యం కావాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని సాహసం తెలంగాణ చేసిందని సిఎం అన్నారు. కరోనా సమయంలో లారీలు, డ్రైవర్లు, హమాలీలు.. అన్నీ కొరతే.. అయినా వాటిని అధిగమిస్తూ.. ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని కొన్నామన్నారు. మిగిలినవి మరో నాలుగైదు రోజుల్లో కొనేస్తాం అని అన్నారు. రైతన్నలు ఆందోళనకు గురికావద్దు.. మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరతామన్నారు. పంజాబ్‌లో 100శాతం కొంటున్న ఎఫ్‌సీఐ తెలంగాణలో అలా కొనకపోవడమేమిటి?… కేంద్రం ఇలా వివక్ష చూపడం సరికాదని.. దీనిపై ప్రధానికి లేఖరాస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బండి కృష్ణమోహన్‌రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.