టి.వేదాంత సూరి: ఓటు వేసే వారు, పోటీ చేసే వారు ఆలోచించాలి
ప్రతి సారీ ఎన్నికలు వస్తూనే వున్నాయి, ఎవరెవరో గెలుస్తూనే వున్నారు. గెలిచిన వారు రక రకాల వాగ్దానాలు ఇవ్వడం, ఆ తరువాత వాటన్నింటిని పట్టించుకోక పోవడం షరా మామూలే అయి పోయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు మన ముంగిట వాలాయి. అందులో పోటీ చేసే వారంతా మామూలు రాజకీయ నాయకుల్లాగానే వాగ్దానాలు చేయడం, ప్రభుత్వాలను, వేరే పక్షం నాయకులను తిట్టడం మామూలై పోయింది. పట్టభద్రలులంటే కేవలం ఉద్యోగార్థులే కాదు, వుద్యోగం చేసే వారు, స్వయం ఉపాధి చేసుకునే వారు, వయో వృద్ధులు వుంటారు కదా. మరి వారందరి శ్రేయస్సు కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు. పట్టభద్రులందరికి ఉద్యోగాలే కావాలా? స్వయం ఉపాధి మార్గాలు లేవా? ఇక వుద్యోగం చేసే వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వయో వృద్ధులకు ఏం కావాలి అన్న దృష్టితో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు, మీ హామీలు ఎంతవరకు ఆచరణలోకి తేగలరు ఆలోచించాలి. అందరూ విద్యావంతులే కదా? పోటీ చేసే వారు, ఓటు వేసేవారు, మరి వారందరికీ మీ మాటలు రుచిస్తున్నాయా? సాధారణ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పోటీ చేస్తున్నారా? ఆలోచించండి… ఇంత వరకు పోటీ చేసి గెలుపొందిన వారు ఏం చేసారు, కేవలం వారి పరపతి పెంచుకోవడానికి , డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే గెలుపొందారు… ఎవరెవరు ఏం చేశారో, ఆ పనులు సాధారణ పట్టభద్రులకు ఏ మేరకు ఉపయోగ పడ్డాయో చెప్పాలి… మరో విచిత్రం ఏమంటే ఒకసారి పట్టా భద్రుల నియోజక వర్గం ఓటరుగా పేరు నమోదు చేసుకుంటే మళ్ళీ వచ్చేసారి ఆ జాబితాలో పేరు ఉండదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు పేరు నమోదు చేసుకోవాలో అర్ధం కావడం లేదు… కనీసం ఈ విషయంలో అయినా పోటీ చేసే అభ్యర్థులు పట్టించుకున్నారా? ప్రతిసారి తమ అనుయాయులను ఓటర్ల జాబితాలో చేర్చుకోవడమా? ఎందుకు ప్రతీ సారి జాబితాలో పేర్లు మార్పులు. ఇవన్నీ ఎన్నికల్లో భేతాళ ప్రశ్నలుగానే మిగిలి పోతాయి, ఈ విషయంలో పట్టభద్రలు, పోటీ చేసే వారు ఆలోచించాలి.
-టి.వేదాంత సూరి
సీనియర్ జర్నలిస్టు