ట్రాక్టర్ ర్యాలీపై తుది నిర్ణయం పోలీసులదే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: జనవరి 26 వ తేదీన రైతులు ఢిల్లీలో భారీ ర్యాలీని తలపెట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, అదే రోజున రిపబ్లిక్ డే కావడంతో, భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయి…కాబట్టి రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అనుమతించకూడదు అని చెప్పి కేంద్రం సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఈరోజు మరోసారి విచారణ జరిపింది. ట్రాక్టర్ ర్యాలీ విషయంలో అనుమతి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పోలీసులకే వదిలేసినట్లు కోర్టు చెప్పింది. ఈ కేసులో ఎటువంటి ఆదేశాలను తాము ఇవ్వదలుచుకోలేదని కోర్టు పేర్కొన్నది. పోలీసులే తుది నిర్ణయం తీసుకోవాలని సీజే అన్నారు. ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ నుంచి ఒకరు తప్పుకోవడంతో కమిటీ పునర్నియామకంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చారు.