ఢిల్లీలో ఒక్కరోజే 6,715 కేసులు

మహారాష్ట్రలో 17 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ/ముంబ‌యి: దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్‌ విజృంభిస్తున్నది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,16,653కు, మరణాల సంఖ్య 6,769కు పెరిగింది. గత 24 గంటల్లో 5,289 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,71,155కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 38,729 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు కరోనా విజృంభణపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రాజధానిగా ఢిల్లీ మారుతున్నదని వ్యాఖ్యానించింది. కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా పరిస్థితిని గురువారం సమీక్షించారు. వరుస పండుగలు, గాలి కాలుష్యం కారణంగానే మరోసారి కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నదని చెప్పారు.

(దీపావ‌ళి బానాసంచాపై ఢిల్లీ నిషేధం)

మహారాష్ట్ర కరోనా విలయతాండవం

ముంబ‌యి: మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,246 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, వైరస్ ధాటికి తాళలేక ఒక్కరోజే 117 మంది ప్రాణాలొదిలారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,03,444కు చేరకుందని ఆరాష్ట్ర వైద్య, ఆరోగ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక ఇప్పటివరకు కొవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 44,804 కు చేరుకుంది. మరోవైపు, గత 24 గంటల్లో 11,277 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,51,282కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,06,519 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.