ఢిల్లీ హైకోర్టులో కరోనా కలకలం..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో కరోనా కలకలం రేపింది. జడ్జి సహా కోర్టు ప్రాంగణంలో పని చేస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది కరోనా భారిన పడ్డారు. అన్లాక్ 4.0లో భాగంగా ఢిల్లీ హైకోర్టు, దాని కింది కోర్టులు సెప్టెంబర్ 1 నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. కొద్ది రోజుల్లోనే అక్కడి చాలా మంది సిబ్బందికి కరోనా రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై సాకేత్ కోర్ట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ ధీర్ సింగ్ మట్లాడుతూ.. కోర్టు పరిసరాల్లో కరోనా నివారణకు శానిటైజర్ వంటి యంత్రాలు అమర్చినా కోర్టు ఉద్యోగులలో కనీసం 20 శాతం మంది కూడా వాటిని వినియోగించడం లేదని తెలిపారు. అంతేకాకుండా కోర్టుకు కొందరు మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వస్తున్నారని, వాదనలు వినేందుకు వచ్చే వారు కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. అందువల్లే జడ్జి, టైపిస్ట్, ఇతర కోర్టు సిబ్బంది కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న కోర్టులు, అందులో పని చేసే సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.