తయారు చేసుకున్న మాస్కులే మేలు!

వాషింగ్టన్‌: మాస్కు.. ఇప్పుడు ఈ ప‌దం అంటే అంద‌రికీ తెలుసు.. దీని ప్రాముఖ్య‌త ఏంటో అంద‌రూ గుర్తించారు… ఇప్ప‌డు మాస్కు అనేది ప్ర‌పంచంలోని ప్ర‌తి మాన‌వుడికి నిత్యావ‌స‌రం.. కాదు మ‌నిషిలో భాగ‌మైపోయింది. ఏది ఉన్నా లేకున్నా కానీ మాస్కు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి కారణ‌మేంటో మ‌న అంద‌రికీ తెలిసిందే… అదే `కొవిడ్‌-19`.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రినీ ఈ మ‌హ‌మ్మారి ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎలాంటి మాస్కులు వాడాలి.. ఎలాంటి మాస్కులు వాడ‌రాదు అనేదానిపై చాలా మందికి చాలా ర‌కాల సందేహాలున్నాయి. అందుకే ఈ మాస్కుల‌పై యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఓ లుక్కేద్దాం. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే ఉత్తమమైనవని పేర్కొన్నారు. అవి ఒక్క పొర క‌లిగిన‌వి అయిన ఓకే అని చెప్పారు. అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కులు మెడికల్‌ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్ట్రీమ్‌ మెకానిక్స్‌ లెటర్స్‌ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నావల్‌ కరోనా వైరస్‌ కణాల పరిమాణంలో ఉన్న కణాలతో కూడిన డిస్టిల్డ్‌ వాటర్‌ను ఇన్‌హెల్లర్‌లో నింపి, ఓ ప్లాస్టిక్‌ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియళ్లతో వాటిని వడకట్టి, వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. ఈ విషయం గురించి అధ్యయనకర్త తాహిర్‌ సైఫ్‌ మాట్లాడుతూ.. ‘పాత్రలో పడుతున్న ప్రతీ నానో- పార్టికల్‌ను అత్యాధునిక మైక్రోస్కోపు ద్వారా పరిశీలించాం. వాటిని లెక్కించాం. వివిధ రకాల ఫ్యాబ్రిక్‌లను అడ్డుపెట్టి లేదా నేరుగా నీటి తుంపరలను వదిలి, ఏ ఫ్యాబ్రిక్‌ ఎంతమేర కణాలను బ్లాక్‌ చేయగలిగిందో పరిశీలించినపుడు సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. నిజానికి శ్వాస పీల్చుకోకుండా అసౌకర్యాన్ని కలిగించే మాస్కుల వల్ల ఊపిరాడటం కష్టమవడమే గాకుండా, వైరస్‌ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్‌ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్‌ ఫ్యాబ్రిక్‌లతో కూడా వైరస్‌ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాలను పరిశీలించాం’ అని చెప్పుకొచ్చారు. ఇలా యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.