తాత్కాలికంగా నిలిపివేస్తాం..

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదన

న్యూఢిల్లీ: వివాదాస్స‌దంగా మారిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఒక‌టిన్న‌రేళ్ల‌పాటు నిలుపుద‌ల చేస్తామ‌ని కేంద్ర స‌ర్కారు స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చింది. ఈ నిర్ణ‌యంతో కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ముగ్గురు కేంద్ర మంత్రులు, 40 రైతు సంఘాల ప్రతనిధుల మధ్య పదో దఫా చర్చలు బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో దాదాపు ఐదు గంటల పాటు జరిగాయి. చ‌ట్టాల‌పై చర్చించి ప్రతిష్టంభనను తొలగించేందుకు రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప‌దో విడ‌త జ‌రిగిన చ‌ర్చ‌ల్లో కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాలు వెంటనే ఆమోదం తెలుపలేదు. తాము అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత చెబుతామని పేర్కొన్నాయి. దీంతో కేంద్రం, రైతు సంఘాల మలి సమావేశం శుక్రవారం జరుపాలని నిర్ణయించారు.

కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాలు గురువారం సమావేశమై చర్చిస్తాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ విలేకరులకు తెలిపారు.

ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రులు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, పియూష్ గోయ‌ల్‌

ఈ మేర‌కు కేంద్ర మంత్రి తోమ‌ర్ మాట్లాడుతూ.. శుక్ర‌వారం మ‌రోసారి చర్చ‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించాం. ఆ రోజు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నా అని తెలిపారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున పెద్ద మ‌న‌సుతో చ‌ర్చించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు భ‌రోసా ఇచ్చాం అని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.