తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్:రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్, ఒరిస్సాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని చెప్పింది. దాంతో రాగల 3, 4 రోజుల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసింది. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.