తెలంగాణ ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్ మోడల్ పేపర్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు. 2 మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్ పేపర్స్ కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహంచనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు, ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇదే షెడ్యూల్ వర్తించనుంది.