తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటా: పూజా హెగ్డే

హైద‌రాబాద్: తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ చిత్ర పరిశ్రమపై‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారని.. అంతేకాకుండా మిడ్ డ్రెస్‌లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సౌత్ ఇండస్ట్రీతోనే స్టార్‌డమ్ పొంది ఇప్పుడు అదే ఇండస్ట్రీపై విమర్శలు చేస్తావా అంటూ అభిమానులు, నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. తాను చేసిన కామెంట్స్ తన కెరీర్‌కు డ్యామేజ్‌ అయ్యేలా కనిపించడంతో పూజా హెగ్డే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తాను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని పేర్కొంది. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదంటూ ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణసమానమని పేర్కొంది. ఇది తనను, తన చిత్రాలను అభిమానించే వారికి తెలిసినా, ఎటువంటి అపార్ధాలకూ తావివ్వకూడదనే తాను మళ్లీ చెబతున్నట్లు వెల్లడించింది. తనకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆ ఇంటర్వ్యూని పూర్తిగా చూస్తే విషయం అర్థమవుతుందని చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.