తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌/అమరావతి: ప‌శ్చిమ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం మంగ‌ళ‌వారం ఉద‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నం, న‌ర్సాపూర్‌ల మ‌ధ్య‌లో కాకినాడ‌కు పైన తీరాన్ని దాటింది. ఈ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. మరో నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షంః తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రాత్రి నుంచే ప‌లుచోట్ల వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఇక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వేంసూర్‌లో అత్యధికంగా 18.7 సెం.మీ వర్షపాతం న‌మోదైంది. నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వర్షం ప‌డ‌గా, మెదక్‌, సిద్దిపేట, కుమ్రంభీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి జల్లులు ప‌డ్డాయి.

తూ.గో. జిల్లా ఉప్పాడ వ‌ద్ద కోత‌కుగురైన తీర ప్రాంతం

పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది.కాకినాడలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, గండేపల్లి మండలాల్లో వర్షం పడుతోంది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

వాయుగుండం వేగం నెమ్మదించడం కొనసాగితే ప్రమాదమేనంటూ ఆంధ్రా యూనివర్సిటీ ఓషినోగ్రఫీ అధికారులు విశ్లేషించారు. దీని ప్రభావంతో కోస్తా అంతట పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని, తీర, కొండవాలు ప్రాంతాల జనజీవనం అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తీరం దాటిన తర్వాత 4 నుండి 5 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు ‘ ప్రజాశక్తి ‘ తో తెలిపారు. వాయుగుండం నెమ్మదించడం కొనసాగితే తుపానుగా కూడా మారే అవకాశాలున్నాయని, రాగల 48 గంటలూ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.