తోటకు అభినందనల వెల్లువ..
గజ మాలలతో సత్కారం..
మండపేట (CLiC2NEWS): మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న నేపథ్యంలో నియోజక వర్గంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. గత ఐదు రోజుల క్రితం తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో నియోజక వర్గంలో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అయితే పదవి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో ఈ నాలుగు రోజుల వ్యవధిలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని దుష్ట శక్తులు మోకాలడ్డాయి. తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి రానీయకుండా విశ్వ ప్రయత్నాలు చేశాయి. తోటకు వచ్చే గౌరవాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి బ్రేకులు వెయ్యాలనే దుర్బుద్ధితో పావులు కదిపి తెరవునుక నాటకాలు ఆడించారు. ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవాలనే దురాలోచనను కార్యరూపం దాల్చి అధిష్టానానికి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి తోట కోసం చెడుగా చెప్పి తోట చరిత్ర మంచిది కాదు.. ఆయన ఎమ్మెల్సీ కి అనర్హుడు అని చెప్పి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం పట్టించు కోలేదు. తోట త్రిమూర్తులు రాజకీయ , వ్యక్తి గత చరిత్రను అవపోసన పట్టిన జగన్ దుష్ట శక్తుల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి తనదైన రీతిలో వ్యవహరించారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ఈ అంశంపై స్పందించారు. గవర్నర్ కోటాలో రాబోతున్న నాలుగు ఎమ్మెల్సీ పదవుల కోసం వెను వెంటనే గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో చర్చలు జరపడంతో అన్ని అంశాలను బేరీజు వేసుకున్న గవర్నర్ నాలుగు ఎమ్మెల్సీ పదవులకు పచ్చ జెండా ఊపారు. ఈ క్రమంలో జిల్లాకు సంబంధించి సోమవారం సాయంత్రం తోట త్రిమూర్తులు పేరు అధికారికంగా ప్రకటించడంతో మండపేట నియోజక వర్గంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మంగళవారం ఆయన నివాసానికి వైఎస్సార్సీపీ నాయకులు చేరుకుని గజమాలలతో ఆయనను ముంచెత్తారు. ఆనందోత్సాహాలతో ఆయనను అభినందించి పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేసి తోట త్రిమూర్తులు పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నిన చివరికి మంచి నాయకుడికి వచ్చే అవకాశాలు, గుర్తింపు ఆపడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తోట సమర్థవంతమైన నాయకత్వానికి ఇచ్చిన గుర్తింపుగా ఎమ్మెల్సీ వచ్చిందని నియోజక వర్గ ప్రజలు భావిస్తూ హార్షాతిరేకాలు తెలుపుతున్నారు. కాగా వైసీపీ కార్యక్రమాల్లో పైకి కౌగిలించుకుంటూ సమయం వచ్చినప్పుడు శకుని పాచికలు విసురుతున్న కొందరి నేతల తీరు పట్ల తోట వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(తప్పకచదవండి: AP: 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం)
