త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ
హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ పోలీసు అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ రాష్ర్ట పోలీసు అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది.
పోలీసు అకాడమీలో 12వ బ్యాచ్‌కు చెందిన 1162 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ కార్యక్రమంలో హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఎస్ఐలకు హోంమంత్రి, డీజీపీ పురస్కారాలు అందజేశారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సివిల్‌కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ కమ్యూనికేషన్‌కు చెందిన 28 మంది ఎస్ఐలు, 448 మంది ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్‌కు చెందిన 25 ఏఎస్ఐలు ఉన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహముద్ అలీ మాట్లాడుతూ. తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. త్వరలోనే మరో 20 వేల పోలీసు నియామకాలు జరుపుతామని స్పష్టం చేశారు. కరోనా, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు.
సాంకేతికతను విరివిగా వాడండి: డీజీపీ
కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధతతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలన్నారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలన్నారు. సీఎం కేసీఆర్ విజన్ మేరకు నేరరహిత సమాజాన్ని కల్పించాలని చెప్పారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. రాష్ర్టంలో పోలీసు శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు, నియామకాలు జరిగాయన్నారు. “ సమాజంలో మార్సు పోలీసులతోనే సాధ్యం. ప్రభుత్వ పథకాల అమల్లోనూ పోలీస్ శాఖ భాగస్వామ్యం కవాలి“ అని మహేందర్‌రెడ్డి అన్నారు.