థియేటర్లలో `ఆర్‌ఆర్‌ఆర్`ను ఎలా నడిపిస్తారో చూస్తాం: బండి సంజయ్
హైదరాబాద్: భీంపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్.. ముస్లిం యువకుడిని పోలి ఉండటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే.. సినిమా రీళ్లను తగులబెడతాని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని సవాల్ చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్ 119వ జయంతి సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్‌ను, ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
(తప్పకచదవండి: డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్!)
ఇప్పటికే ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి, ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉందని బాపురావు అన్నారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని ఆయన అన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ ఎంపి ఘాటు వ్యాఖ్యలు చేశారు.