దుబ్బాకః వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నగదు

మెదక్ : ఎన్నికలప్పుడు ఒకవైపున జోరుగా ప్రచారాలు చేస్తూనే, మరోవైపు డబ్బు, మద్యంతో ప్రజలను ప్రలోభపెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తుంటారు. ప్రధానంగా తటస్థంగా ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రలోభాలకు గురిచేస్తుంటారు. ఇప్పుడు దుబ్బాకలో ప్రచారహోరు మంచి జోరుమీదుంది. కాగా కాస్తపూర్ వద్ద గతరాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 9,49,960 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దుబ్బాకలో ధన ప్రవాహం మొదలైందా? అని అందరూ చర్చించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నర్సింగ్ మండలం కాస్లపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు నిన్న రాత్రి వాహనాలు తనిఖీలు చేపట్టగా భారీ నగదు వెలుగు చూసింది. రామాయంపేట నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి ఎపి28బిడబ్యూ0005 నంబరుగల వాహనంలో రూ. 9,49,960 నగదును పట్టుకున్నారు. రామాయంపేట గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి అనే వ్యక్తి కారులో ఎటువంటి పత్రాలు, ఆధారాలు లేకుండా ఈ డబ్బును తరలిస్తున్నాడు అని తెలిసింది. తనిఖీలు చేస్తున్న ఎస్ఐ నాగరాణి నగదును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పట్టుకున్న నగదును రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఈ నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.