దుబ్బాకలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన నేతలు!
హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ముఖ్య నేతలు

సిద్ధిపేట: దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రోజురోజుకు ఆ పార్టీ బలహీనపడి పోతోంది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వీరిద్దరితో పాటు 2 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది ముఖ్య నేతలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు భారీ మద్దతు వస్తుందని తెలిపారు. ఈ మద్దతు చూస్తుంటే సుజాత భారీ మెజార్టీతో గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల వరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటాడు. కానీ తాము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. కేవలం ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఓట్లు వేద్దామా? ఇక్కడి ప్రజలతో కష్టసుఖాలు పాలు పంచుకునే వారికి ఓటేద్దామా? అని అడిగారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా వస్తాయో.. రావో అని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. పోటీకి సోలిపేట సుజాత అసమర్థురాలు అని ఉత్తమ్ మాట్లాడటం సరికాదన్నారు. దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్ కించపరిచాడని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్‌రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్‌రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది.