దుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
చివరి గంటలో కరోనా రోగులకు అవకాశం

సిద్దిపేట : ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలీంగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది.
నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకే సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. చివరి గంటలో కేవలం కొవిడ్ రోగులకు మాత్రమే ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల భవితవ్యం 10వ తేదీన తేలనుంది.
దుబ్బాక నియోజకవర్గం పరిధిలో పట్టణ పురపాలక విభాగం, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలు, మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాల్లో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన 89 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలు, 800 మంది అదనపు పోలింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే సరికి ఇది మరింత పెరిగే అవకాశముంది.
దుబ్బాకలో 4 గంటల వరకు 78.12% శాతం పోలింగ్నమోదు
సాయంత్రం 4 గంటల వరకు దుబ్బాకలో 78.12 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. 5 నుంచి 6 గంటల మధ్య కొవిడ్ బాధితులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.