దుబ్బాక ఎవ‌రిది?

ఎగ్జిట్‌ పోల్స్ ఏమ‌న్నాయి?

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ‌తో జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ నిన్న‌టితో ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే దుబ్బ‌కాలో నిలిచేదెవ‌రు? అధికార‌ప‌క్ష‌మా..? లేక బిజెపి, కాంగ్రెస్ పార్టీలా? అంద‌రిలోనూ ఇప్పుడు ఉత్కంఠ నెల‌కొంది. ఎక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగినా దాదాపు అధికార పార్టీనే ఆ సీటును కైవ‌సం చేసుకుంటుంది. కానీ దుబ్బాక స్థానానికి కొన్ని సంస్థలు నిర్వహించిన కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం భిన్నంగా అంచానా వేశాయి. ఒక సంస్థ అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు దక్కుతుందని పేర్కొనగా.. మరో సంస్థ బిజెపి చేజిక్కించుకుంటుందని అంచనా వేసింది. ఏది ఏమైనా 2018లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 82.61 శాతం పోలింగ్‌ నమోదవ్వగా.. నేడు 82 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలు తేల్చనున్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎవరివైపు?
దుబ్బాక ఉప ఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆయా సంస్థలు విడుదల చేశాయి. థర్డ్‌ విజిన్‌ రీసెర్చ్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత తొలి స్థానంలోనూ.. 33-36 శాతం ఓట్లతో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రెండోస్థానంలోనూ, 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మూడోస్థానంలోనూ నిలుస్తారని అభిప్రాయపడింది. ఇక పొలిటికల్‌ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 47 శాతం ఓట్లతో బిజెపికి మొదటిస్థానం రాగా.. 38 శాతం ఓట్లతో టిఆర్‌ఎస్‌, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ తరువాతి స్థానాల్లో నిలుస్తాయని పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్‌లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉండటంతో… దుబ్బాకలో గెలుపు ఎవరిది అనేది తెలియాలంటే.. ఓట్ల లెక్కింపు జరిగే పదో తేదీ వరకు ఆగాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.