దేశంలో ఇంకా ఆక‌లికేక‌లు!

ప్రపంచ ఆకలిసూచిలో 94 స్థానంలో భారత్‌

న్యూఢిల్లీ : 2020లోకి వ‌చ్చాము.. ఎంతో అభివృద్ధి సాధించాము.. అగ్ర‌రాజ్యాల‌తో పోటీ ప‌డుతున్నాము.. ప్ర‌పంచ ఆర్థిక‌ శ‌క్తుల‌లో భార‌త్ ముఖ్య‌మైన‌ది… ఇలాంటి వార్త‌లు రోజు పేప‌ర్ల‌లో.. టివిల‌లో వింటూనే ఉన్నాము.. ఈ వార్త‌లు విని నిజంగానే దేశం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతోంది అనుకుంటున్నాము.. కానీ ఇంకా ఈ దేశంలో ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయ‌ట‌. పట్టెడన్నం కోసం జానెడు పొట్టలు అల్లాడుతూనే ఉన్నాయ‌ట‌.. చిన్నారుల ప‌రిస్థితి మ‌రీ భాయాన‌క‌మ‌ట‌.. ఈ మాట‌లు అంటున్న‌ది ఎవ‌రో కాదు.. ప్ర‌పంచంలోని అన్ని దేశాల ఆకలి లెక్కలను చూసే గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ (జీహెచ్​ఐ). గ్లోబల్‌ హంగర్‌ సూచి(ప్రపంచ ఆకలి సూచి)లో భారత్‌ 94వ స్థానానికి దిగజారింది. సూచీలో ఆర్థికంగా, సామాజికంగా కాస్త మనకన్నా వెనుకబడిన దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచాయి. ఇది అత్యంత తీవ్రమైన కేటగిరీ అని, పేలవమైన సంస్కరణల అమలు ప్రక్రియ, పర్యవేక్షణ లేకపోవడం, పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో వైఫల్యంతో అతిపెద్ద దేశమైనప్పటికీ..భారత్ అతి తక్కువ ర్యాంక్‌కు పడిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. భారత జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ నివేదిక పేర్కొంది.

 

107 దేశాల్లో సర్వే జరిపితే.. భారత దేశం 94వ స్థానంలో నిలిచింది. దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో స్టంటింగ్‌ రేటు (ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు) 37.4 శాతం ఉండగా, వాస్టింగ్‌ రేటు (వయసుకు తగిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తు ఉండటం) 17.3 శాతంగా ఉంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు 3.7 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. గతేడాది 117 దేశాలకు గాను భారత్‌ 102వ స్థానంలో నిలిచింది. జనాభా అధికం కావడంతో.. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పోషకాహార లోపం అధికస్థాయిలో ఉంది. దేశంలో ప్రతి ఐదో చిన్నారి యుపిలోనే జన్మిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌, పాకిస్తాన్‌లు కూడా ఇదే కేటగిరీలో నిలిచినప్పటికీ.. భారత్‌కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ 75వ ర్యాంక్‌ కాగా, మయన్మార్‌, పాకిస్తాన్‌లు వరుసగా 78, 88 స్థానాల్లో నిలిచాయి. నేపాల్‌ 73లో, శ్రీలంక 64వ స్థానాల్లో ఉన్నట్లు అంటే ”మధ్యమం” కేటగిరీల్లో ఉన్నాయని నివేదిక సూచించింది. చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ సహా పదిహేడు దేశాలు ఐదుకంటే తక్కువ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ( జిహెచ్‌ఐ) ర్యాంకులతో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కన్సర్న్‌ వరల్డ్‌, వెల్త్‌ హంగర్‌ హిల్ఫే సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌, 2020లో 132 దేశాల సమాచారాన్ని సేకరించినప్పటికీ.. 107 దేశాలకు మాత్రమే ర్యాంకులు ఇచ్చారు. సమగ్ర సమాచారం లేకపోవడం వల్ల 25 దేశాలకు ర్యాంక్‌లను లెక్కించడం సాధ్యపడలేదని నివేదికలో వెల్లడించారు.
ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువవడానికి కారణం పెరుగుతున్న జనాభేనని జీహెచ్​ఐ అభిప్రాయపడింది. జనాభా పెరుగుతున్న కొద్దీ చాలా మందిపోషకాహార లోపానికి బాధితులవుతున్నారని పేర్కొంది. మన దేశంలోనే ఎక్కువగా పిల్లలు బక్కచిక్కిపోతున్నారని (చైల్డ్‌ వేస్టింగ్‌) పేర్కొంది. గతేడాది చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు 20.8శాతం ఉండగా.. కొద్దిగా మెరుగై 17.3శాతానికి చేరింది. దేశంలో పౌష్టికాహార లోపం సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ ప్రతినిధి సచిన్ కుమార్ జైన్ అన్నారు. పౌష్టికాహార లోపం, ఆకలి సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.