నాకు తెలుగు భాష వచ్చు, మీ భాష రాదు: నాగబాబుకు ప్రకాష్‌రాజ్ కౌంటర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతివ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలు మరింత వేడిని పెంచాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటరివ్వగా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.
”నాకు తెలుగు భాష వచ్చు.. కానీ.. మీ భాష రాదు” అంటూ సినీనటుడు ప్రకాష్‌రాజ్ మెగా బ్రదర్ నాగబాబును ఉద్దేశించి తాజాగా తెలుగులో ట్వీట్ చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాష్‌రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలపై పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. ‘మీకు బిజెపి నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే మీకు హర్షించగలిగే మనసు లేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. అయితే.. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరూ అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ.. మీ భాష రాదు’ అంటూ ట్వీట్ చేశారు. సినీ నటులు ప్రకాష్‌రాజ్, నాగబాబుల మధ్య మాటల యుద్ధానికి తెరపడుతుందో, లేదో చూడాలి మరి..!
#justasking https://t.co/p86iDuaEP2
— Prakash Raj (@prakashraaj) November 28, 2020