నూటికి నూరు శాతం విజయం మనదే: సిఎం కెసిఆర్

హైదరాబాద్‌ : జిహెచ్ ఎంసి ‌ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తమదేనని టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ముగిసింది. భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్‌ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు గులాబీ అధినేత. గ్రేటర్‌ ఎన్నికల్లో డివిజన్ ఇంఛార్జిల పేర్లను ప్రకటించారు కేసీఆర్.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఎమ్మెల్యేను ఇంఛార్జ్‌గా పెట్టారు… ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను రెండు విడతలుగా ప్రకటిస్తామని, మొదటి విడత బుధవారం సాయంత్రం, రెండో విడత గురువారం ప్రకటిస్తామని వెల్లడించారు కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను తయారు చేసి, వాటిని డివిజన్ల వారీగా ఇంచార్జిలకు అప్పగించారు. డివిజన్ల వారీగా ఓటరు లిస్టులను, టిఆర్ఎస్ కార్యకర్తల జాబితాను కూడా ఇంచార్జులకు అందించారు.

ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జ్‌గా ఉండడంతో పాటు.. మంత్రులకు కూడా డివిజన్ బాధ్యతలు అప్పగించారు కేసీఆర్… గ్రేటర్ ఎన్నికల్లో 105 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. వరద బాధితులకు సంబంధించి ఇప్పటికే 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని.. లక్షా అరవై వేల దరఖాస్తులు క్లియర్‌ అయ్యాయని వెల్లడించారు. గ్రేటర్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగతా వారికి ఇస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.

డిసెంబ‌రు రెండో వారంలో జాతీయ స్థాయి నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ స‌దస్సుకు దేశంలోని ప్ర‌ధాన ప్రాంతీయ పార్టీల‌ను ఆహ్వానిస్తామ‌న్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే టిఎంసి అధినేత్రి ప‌శ్చిమ బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ, జెడిఎస్ నేత కుమార‌స్వామి, ఎన్సీపి అధ్య‌క్షుడు శ‌ర‌ద్‌ప‌వార్ త‌దిత‌రుల‌తో మాట్లాడిన‌ట్లు నేత‌ల‌కు ఆయ‌న వివ‌రించారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వ కార్మిక వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.