నోట్లపై 28 రోజుల పాటు వైరస్
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
మెల్‌బోర్న్ : ఎండాకాలమే కరోనా మహమ్మారిని నియంత్రించక పోతే శీతాకాలం(చలి) పరిస్థితి ఎలా ఉంటుందా అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. శీతాకాలంలో ఈ మమ్మారి మరింతగా ముదిరే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త తెలిపారు. అయితే అతినీలలోహిత కిరణాల మధ్య వైరస్ ఎక్కువ కాలం జీవించదన్న విషయం తెలిసిందే. స్టీల్ కానీ, ప్లాస్టిక్ వస్తువులపై వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుందనే అంశంపై చాలా అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మనుషులు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా .. వైరస్ వ్యాప్తి చెందుతుంది. గాలిలో ఉండే తుంపర్ల వల్ల కూడా వైరస్ ప్రబలుతుందని కొన్ని సర్వేలు తేల్చిన విషయం కూడా మనకు ఇంతకు ముందు తెలిసిందే.
కాగా వైరస్ గురించి కొత్త విషయం ఏమిటంటే.. కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లు, స్టీల్ వస్తువులపై కరోనా వైరస్ 28 రోజుల పాటు బ్రతికి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తాజాగా జరిపిన పరిశోధనలు వెల్లడించారు. వాటి మీద వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధకులు తేల్చారు. ఈ విషయాలు ల్యాబ్‌లో పరిశోధనలు జరిపిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.
అలాగే 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ మనుగడ ఒక రోజు కన్నా తక్కువకు పడిపోయిందని తేలింది. టచ్‌స్క్రీన్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఎటిఎంలు, సూపర్‌మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్‌అవుట్‌లు, ఎయిర్‌పోర్ట్ చెక్ఇన్‌ల వద్ద వైరస్ తీవ్రత అధికంగా ఉంటుంది. కరోనా సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇతరులకు త్వరగా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వారు తుమ్మడం, దగ్గడం, మాట్లాడేప్పడు విడుదలయ్యే వైరస్ కణాలు ఉపరితలాలపై నిలచే ఉంటాయి. ఇది వైరస్ వ్యాప్తికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
గతంలో వైరస్ సంక్రమిత స్టీల్, ప్లాస్టిక్ పాత్రలను తాకితే కూడా కోవిడ్19 వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొన్నది. బ్యాంకు నోట్లపై వైరస్ రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటుందని, ప్లాస్టిక్-స్టీల్‌పై ఆరు రోజుల పాటు వైరస్ సజీవంగా ఉంటుందని తొలుత కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. అయితే ఆస్ట్రేలియా ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వో తాజాగా తన నివేదికలో కొత్త విషయాన్ని వెల్లడించింది. అత్యంత స్మూత్ సర్ఫేస్‌లపై వైరస్ సుమారు 28 రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఆస్ట్రేలియన్ ఏజెన్సీ పేర్కొన్నది. మొబైల్ ఫోన్ స్క్రీన్లు, ప్లాస్టిక్, బ్యాంకు నోట్లపై 20సెంటీగ్రేడ్ల వద్ద వైరస్ 28 రోజుల పాటు బ్రతికి ఉంటుందని సీఎస్ఐఆర్వో వెల్లడించింది.