నల్లగొండ జిల్లాపై కెసిఆర్ వరాల జల్లు
ప్రతి గ్రామపంచాయతీకి 20లక్షలు మంజూరు: ముఖ్యమంత్రి కెసిఆర్

హాలియా: నల్లగొండ జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కానుక ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన టిఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రానికి రూ.30లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే నల్లగొండ మున్సిపాలిటీకి రూ. 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సిఎం ప్రత్యేక నిధి నుంచి వాటిని విడుదల చేస్తామని తెలిపారు. రేపే ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా సిఎం ప్రకటించారు. అలాగే నెల్లికల్లు, చింతలపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో భూవివాదాలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే జిల్లాలోని స్థానిక సంస్థలకు రూ.186 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. త్వరలో అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో నాతో కలిసి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నా పక్కన లేకపోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నెల్లికల్, జాన్‌పహాడ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, రూ. 2500 కోట్లు లిఫ్టు స్కీంలకు మంజూరు చేస్తాం. ఏడాదిన్నర లోపు వీటిని పూర్తి చేస్తాం. ఎడమ కాల్వ కింద ఏకరం కూడా ఎండిపోనివ్వం. వీర్లపాలెం లిఫ్టు, తోపుచర్ల లిఫ్టులు మంజూరు చేస్తాం. లిఫ్టులను పూర్తి చేసి నీటిని అందించకపోతే నల్లగొండ జిల్లా ప్రజలను ఓట్లు కూడా అడగం. పార్టీ నేతలు ఎక్కడికక్కడ సహకరించి ఎత్తిపోతల పథకాలు ఏడాదిన్నరలోపే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులకు అవసరమైతే గోదావరి నీళ్లు పెద్దదేవలపల్లికి తీసుకొచ్చి కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి వారి బాధలు తీరుస్తాం అని పేర్కొన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు సిఎం కెసిఆర్ వార్నింగ్
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదు. సభకు వచ్చిన నిరసన తెలిపిన వారిని ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీల నేతలపై మండిపడ్డారు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు మాది. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మేం తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారు అని సిఎం హెచ్చరించారు.