పటేల్‌కు ప్రధాని మోడీ నివాళి
గాంధీనగర్: దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని.. ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్‌ను జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. పుల్వామా దాడి సమయంలో కొందరు సైనికుల పక్షాన నిలవకపోవడం బాధించిందని, దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి రాజకీయాలు మరోసారి చేయవద్దని ఆయన అభ్యర్థించారు
ఐక్యతా శిల్పం దగ్గర పర్యాటక కేంద్రాలు
కెవడియా(గుజరాత్): రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నర్మద జిల్లాలోని ప్రఖ్యాత ‘ఐక్యతాశిల్పం(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)’కి దగ్గరలో నాలుగు పర్యాటక ప్రదేశాలను ప్రారంభించారు. ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని మొదట ప్రారంభించారు. అనంతరం 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా టెక్నాలజీ ఆధారిత థీమ్ పార్క్ ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు.