పాత ప‌ద్ధ‌తిలోనే వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఈ నెల 21 తేదీ నుంచి పాత ప‌ద్ధ‌తిలోనే రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే కార్డ్ (సిఎఆర్ డీ) విధానంలో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌ను చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి య‌థాత‌థంగా రిజిస్ట్రేష‌న్లు కొనసాగుతాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 21న రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆధార్, కులం, కుటుంబ‌స‌భ్యుల వివ‌రాలు, సామాజిక హోదా త‌దిత‌రాల‌ను తొల‌గిస్తూ మాన్యువ‌వ‌ల్ను స‌వ‌రించేదాకా వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించి స్లాట్ బుకింగ్, ప్రాప‌ర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబ‌రు (పిటిఐఎన్‌) న‌మోదును ఆపాల‌ని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 11న స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా 14 నుంచి రిజిస్ట్రేష‌న్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా పాత ప‌ద్ధ‌తిలోనే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ జ‌ర‌గాల‌ని సిఎం కెసిఆర్ నిర్ణ‌యించారు. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా కొన్నాళ్ల పాటు పాత ప‌ద్ధ‌తిలోనే రిజిస్ట్రేష‌న్లు కొన‌సాగుతాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.