10న పార్లమెంటు కొత్త భవనానికి మోదీ శంకుస్థాపన
నూతన భవనంలో లోక్సభ సభ్యులకు 888 సీట్లు!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ జరుపుతారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం మీడియాకు తెలిపారు. ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ జరిపే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు గత వారంలో అధికారులతో కలిసి ఓం బిర్లా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శంకుస్థాపన కోసం లాంఛనంగా ప్రధానిని ఓం బిర్లా ఆహ్వానించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సంవత్సరమే మనం పార్లమెంటు నూతన భవనంలో రాజ్యసభ, లోక్సభ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నామని స్పీకర్ తెలిపారు.
కాగా, నూతన పార్లమెంటు భవనంలో మొత్తం 1224 మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లను ఏర్పాటు చేయనున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. అందులో లోక్సభ సభ్యుల కోసం సుమారుగా 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326కు పైగా సీట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. నూతన పార్లమెంట్ భవనం పాత భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ విస్తీర్ణంలో ఉండంనుందని చెప్పారు. కొత్త భవనం దేశంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఓం బిర్లా తెలిపారు. మొత్తం రూ.971 కోట్ల ఖర్చుతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ వెల్లడించారు.
పార్లమెంటు భవన నిర్మాణ పనుల కాంట్రాక్టును హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఇందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. రాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్లు, ఎంపీలు, ప్రజలు భవంతిలోకి అడుగుపెట్టేందుకు వేర్వేరు మార్గాలు ఉంటాయి. పేపర్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ ఇంటర్ఫేస్లు ఏర్పాటు చేస్తారు. ఎంపీలు, మంత్రుల కార్యాలయాలతో పాటు, రాజ్యాంగాన్ని షోకాజ్ చేసే రాజ్యాంగ హాలును కూడా భవంతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.