పోరాటం ఆగొద్దు
ఇది పండుగల వేళ, జాగ్రత్తలు తప్పనిసరి : ప్రధాని నరేంద్ర మోడీ
ఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… దేశంలో లాక్డౌన్ ఆంక్షలు ముగిసినప్పటికీ, కరోనా వైరస్ కథ ముగిసిపోలేదని చెప్పారు. ఈ సమయంలో టెస్టింగ్ మాత్రమే అతి పెద్ద, శక్తిమంతమైన ఆయుధమని చెప్పారు. కరోనా నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్నారు. మన దేశంలో రికవరీ రేటు ఎక్కువ.. మరణాల రేటు తక్కువని తెలిపారు. దేశంలో 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో 10 లక్షల మందిలో 25 వేల మందికి సోకినట్లు వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పారు. అమెరికాలో కానీ, యూరోపియన్ దేశాల్లో కానీ కరోనా కేసులు మొదట్లో తగ్గినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 90 లక్షలకు పైగా కొవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. చాలా మంది మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. మాస్కులు లేకుండా తిరిగితే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టినట్లేనన్నారు. కరోనాపై పోరాటం సుదీర్ఘమైందన్నారు. కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు. కరోనాపై విజయం సాధిస్తున్నాం కాబట్టి అలసత్వం పనికిరాదన్నారు. కేసులు తగ్గాయి కాబట్టి కరోనా పోయిందని భావించొద్దన్నారు. ఇది పండుగల సీజన్ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మన జీవితాలు ప్రమాదంలో పడుతాయన్నారు. పండుగల సంతోషం నిరంతరం ఉండాలంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.