ప్రతి ఇంటికీ రూ.పదివేలు : సిఎం కేసిఆర్‌

హైదరాబాద్‌: వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌ నగరంలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ పది వేల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ అర్ధిక సాయం అందచేస్తామని తెలిపారు. వరదలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం కేసిఆర్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరదల కారణంగా ఇబ్బందులు పడ్డ హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరద ప్రభావానికి గురైన వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు గాను జిహెచ్‌ఎంసి పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు బృందాలుగా ఏర్పడాలని సూచించారు. పూర్తిగా ఇళ్లు కోల్పయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ. 50 వేలు సహాయంగా అందించాలన్నారు. వరదలతో దెబ్బతిన్న పేదలను ఆదుకునేందుకు పురపాలక శాఖకు తక్షణనే రూ. 550 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం నగరంలో కురిసిందని తెలిపారు. బస్తీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వ‌ర‌ద ముంపులో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్‌వాసుల‌కు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అండ‌గా నిల‌వాని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.