ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

హైదరాబాద్ : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి తొలి సర్కార్ ఏర్పాటులో నాయినితో పనిచేసిన అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మధ్యాహ్నం మహాప్రస్థానంలో:
నాయినికి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆస్పత్రికి వెళ్లి నాయిని భౌతికకాయాన్ని మినిస్టర్ క్వార్టర్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో నర్సన్న కీలకపాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం క్వార్టర్స్‌లో చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
నాయిని మృతిపై నేతల దిగ్భ్రాంతి
నాయిని మృతి పట్ల పలువురు మంత్రులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ పోరులో నాయినితో ఉన్న ఉన్న అనుబంధాన్ని గుర్తచేసుకున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన లేని లోటు పూడ్చలేదన్నారు. కుటుంబానికి సంతాపం ప్రకటించారు.