ప్రైవేట్ ఆసుపత్రిలలో అడ్డగోలు వసూళ్లపై నిఘా
నల్లగొండ: కరోనా విపత్కర పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణితో కాకుండా సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సూచించారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కొండల్ రావు, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిల నేతృత్వంలో పోలీస్, వైద్య శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి ఆసుపత్రుల్లో టెస్టులు చేయకుండా రోగులకు బిల్లులు వేస్తున్న విషయాన్ని నిర్ధారించి ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగికి సరైన పరీక్షలు నిర్వహించకుండానే కరోనా పేరుతో బిల్లులు వేసినట్లుగా వచ్చిన పిర్యాదుతో స్పందించి వైద్య శాఖ సమన్వయంతో ఆసుపత్రిపై దాడులు నిర్వహించడం జరిగిందని, ఈ దాడులలో ఆసుపత్రిలో రోగులకు పరీక్షలు నిర్వహించకుండా బిల్లులు వసూలు చేస్తున్నట్లుగా తేలడంతో నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని, ఆసుపత్రిని సీజ్ చేశామని ఎస్పీ రంగనాధ్ వివరించారు.
ఇలాంటి కష్ట కాలంలో ఆసుపత్రులు, వైద్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని కోరారు. విపత్కర పరిస్థితులలో వ్యాపార ధోరణితో వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. ఎంతో ఓపికతో తమ వద్దకు వచ్చే రోగులకు సేవలందించే ఆసుపత్రులు, వైద్యుల పట్ల ఉన్న గౌరవం మరింత పెరిగేలా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. వైద్యులపై ప్రజలలో ఉన్న ప్రేమ, గౌరవం పెంచుకునేలా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు.
ఇకపై జిల్లా వ్యాప్తంగా అడ్డగోలుగా చార్జీల రూపంలో రోగులను ఇబ్బందులకు గురి చేసే ప్రైవేట్ ఆసుపత్రిలపై నిఘా మరింత పెంచుతామని, ప్రజలు సైతం టెస్టులు చేయకుండా, సరైన చికిత్స, సౌకర్యాలు కల్పించకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు వేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ రంగనాధ్ ప్రజలకు సూచించారు. ఆస్పత్రిపై జరిపిన దాడులలో వన్ టౌన్ ఇంచార్జి సిఐ మొగిలయ్య, ఎస్.ఐ. వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీను, కిరణ్, వైద్యశాఖ ఆధికారులు అరుంధతి, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు