ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు : కవిత
నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విజయ దుందభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గానూ టిఆర్ ఎస్‌కు 728 ఓట్లు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తనకు సహకరించి, గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కవిత ధన్యవాదాలు చెప్పారు.
మొత్తం 823 ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 39, కాంగ్రెస్ 22 ఓట్లు పోలయ్యాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్‌లో 221 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 197, బీజేపీకి 17, కాంగ్రెస్‌పార్టీకి 7 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు. ఈ మేరకు ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
(తప్పక చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం)
డాన్స్ చేసిన ప్రశాంత్ రెడ్డి
ఉప ఎన్నికలో కవిత గెలుపుతో టిఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. జిల్లా నాయకులు,కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కవిత ఇంటి వద్ద ఉత్సాహంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి నృత్యం చేశారు. న్యాయం గెలిచిందని, మోసం ఓడిపోయిందని ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.