పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా?
కరోనా కట్టడికి ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనానికి నివేదికను సమర్పించింది… అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు… పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. క్లబ్బులు, థియేటర్లు, పబ్బులు, మద్యం షాపులపై కరోనా ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.
అలాగే, వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ప్రతీ ఆఫీస్‌లో కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని పేర్కొంది. కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. లాక్‌డౌన్ లేకపోయినా.. కనీసం కంటైన్మెంట్ జోన్లు అయినా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీనికోసం నిపుణులతో కమిటీ వేయాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు.
కాగా, ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.
[…] పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? […]