పరుగెడుతూ అంబులెన్స్‌కు దారి..
వీడియో వైరల్

హైదరాబాద్: రాజధానిలో ట్రాఫిక్ ట్రబుల్ తెలియని వారుండరు. అర్జంటుగా వెళ్లాలనుకునే వారి ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో ప్రతిరోజు ప్రయాణికులు గంటలతరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తుంటారు. ఇక ఆస్పత్రి లాంటి వాటికి ఎమర్జెన్సీగా వెళ్లాలనుకునే వారు ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నగరంలో చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్‌కు దారి చూపి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
నగరంలో అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బాబ్జీ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ ఉండే మొజంజాహీ మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కోఠీ వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడాన్ని చూసి ఆ వాహనానికి దారి క్లియర్ చేశాడు. అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు ఆయనే స్వయంగా వాహనం ముందుగా పరుగెడుతూ.. వెనుక అంబులెన్స్ ఉన్న విషయాన్ని వాహనదారులకు సూచిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకోవడంతో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ను మెచ్చకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరూ.. ఓ లుక్కేయండి.. కానిస్టేబుల్ బాబ్జీని అభినందించండి.