ఫామ్‌హౌజ్‌లో రేపు బాలు అంత్యక్రియలు

చెన్నైః గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బహుముఖ ప్రజ్ఙాశాలి. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సింగర్, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత.. వీటన్నింటికీ మించి మంచి వ్యక్తి. ఆయన లేరంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి. అంతలా ఆయన తన పాటతో ఓలలాడించారు. బాలు మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన స్వగృహానికి బాలు భౌతిక కాయాన్ని తరలించారు. రాత్రి 9 గంటలకు భౌతిక కాయాన్ని స్వగృహం నుంచి ఫాంహౌస్‌కు తరలిస్తారని సమాచారం. రేపు ఉ.10:30 గంటలకు తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివస్తున్నారు.