ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్!

న్యూఢిల్లీ: ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను రెండు దఫాలుగా నిర్వహించనున్నారు.! బడ్జెట్ సమావేశాల మొదటి భాగం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో భాగాన్ని మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ నెల 29న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారని, ఫిబ్రవరి 1న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మాదిరిగానే షిఫ్ట్ పద్ధతి సహా అన్ని కరోనా నిబంధనలను పాటిస్తారని పేర్కొన్నాయి. లోక్‌సభ సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని తెలిపాయి. రాష్ట్రపతి ప్రసంగం రోజు, బడ్టెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రం లోక్‌సభ ఉదయం సమావేశమవుతుందని, మిగతా రోజుల్లో మధ్యాహ్నం ప్రారంభమవుతుందని ఆ వర్గాల సమాచారం.